మాతృదేవోభవ అన్న మాటలోని అంతరార్థం కంటికి కనిపించని దైవం, అమ్మలా కనిపించే రూపంలో అవతరించాడని! 'కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి....' ఈ ప్రపంచంలో చెడ్డ కొడుకులు ఉండవచ్చు కానీ, చెడ్డ తల్లి మాత్రం ఉండదన్న ఆదిశంకరాచార్యుల మాట అమ్మ ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది.
బిడ్డకు ప్రథమ గురువు తల్లి. రాక్షస రాజైన హిరణ్యకశిపుడి భార్య లీలావతి, నారద మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు విన్న హరికథలు ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాదుణ్ని మహా భక్తుడిగా మార్చాయి. అలాగే, అర్జునుడు పద్మవ్యూహ రహస్యం చెబుతున్నప్పుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు దాన్ని నేర్చుకున్నాడు. తల్లి ఆలోచనలు, ఆమె చూసే దృశ్యాలు, వినే మాటలు గర్భంలో ఉన్నప్పటినుంచే బిడ్డ వ్యక్తిత్వానికి పునాదులు వేస్తాయి. తల్లి.. శరీరాన్ని మాత్రమే కాదు, బిడ్డ మనసును కూడా నిర్మిస్తుందని ఈ కథలు నిరూపిస్తున్నాయి.
సాధారణంగా తల్లికి తన బిడ్డల విజయమే ముఖ్యం. కానీ కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు అమ్మ ఆశీర్వాదం కోరినప్పుడు గాంధారి 'నువ్వు గెలవాలి' అన లేదు. బదులుగా 'యతో ధర్మస్తతో జయః... ఎక్కడ ధర్మం ఉంటే అక్కడే విజయం ఉంటుంది' అని పలికింది. అలాగే శ్రీరాముడు అడవులకు వెళ్తున్నప్పుడు, కౌసల్యాదేవి తల్లిగా దుఃఖించినా- 'రామా! నువ్వు ఏ ధర్మాన్ని రక్షిస్తు న్నావో, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంద'ని దీవించి పంపింది. బిడ్డల మీద మమకారం కన్నా ధర్మం మీద గౌరవం చూపడమే తల్లి అసలైన బాధ్యత.
కఠినమైన తపస్సులకు లొంగని దైవం, నిష్కల్మ షమైన మాతృప్రేమకు దాసోహం అంటాడు. యశోదమ్మ రోలుకు కట్టేసినప్పుడు, విశ్వమంతా వ్యాపించి ఉన్న కృష్ణ పరమాత్మ తల్లి ప్రేమపాశా నికి లొంగిపోయాడు. పురాణాలలో మదాలస పాత్ర అత్యంత విశిష్టమైనది. ఆమె తన బిడ్డలకు జోలపాటలు పాడుతూనే 'శుద్దోసి బుద్దోసి నిరంజ నోసి... సంసార మాయా పరివర్ణితోసి' అని బోధించేది. దీనివల్ల ఆమె కుమారులు గొప్ప జ్ఞానులయ్యారు. కుంతీదేవి చిన్నవయసులోనే భర్తను కోల్పోయినా, అడవులపాలైనా కుంగిపోకుండా, దైవచింతనతో తన సంతానాన్ని వీరులుగా తీర్చిదిద్దిన ధీరమాత!
మహాభారతంలోని ధర్మవ్యాధుడి కథ మనకు నేర్పే పరమ సత్యం ఏంటంటే- వందల ఏళ్ల తపస్సు కన్నా, పుణ్యక్షేత్రాల దర్శనం కన్నా తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా చేసే సేవే గొప్ప ఫలితాన్నిస్తుంది. నాస్తి మాతృసమో గురుః... తల్లిని మించిన గురువు లేరు. పిల్లల ఉన్నత స్థితి కోసం తల్లి పడే తపన వర్ణనాతీతం! అమ్మ మనకు జన్మనిస్తే, ఆమె నేర్పిన ఆధ్యాత్మిక విలువలు మనకు పునర్జన్మను ఇస్తాయి. అమ్మను గౌరవించడమంటే మన మూలాలను గౌరవించడం, మనలోని దైవత్వాన్ని మేల్కొల్పడం! అంతేకాదు, సాక్షాత్తూ ఆ పరాశక్తిని పూజించడమే! నిస్వార్థ ప్రేమను పంచే రెండక్షరాల తీయని పదం అమ్మ!!
